![]() |
బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘డాన్’ (Don) మూడో భాగానికి సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ల తర్వాత ఈ ఐకానిక్ సిరీస్ లోకి కొత్త డాన్‌గా రణవీర్ సింగ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే, గత కొన్ని నెలలుగా రణవీర్ సింగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నాడనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో విపరీతమైన దుమారం రేపుతోంది. తాజాగా ఈ వివాదంలోకి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ హై-ప్రొఫైల్ వివాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘డాన్ 3’ మేకర్స్ అయిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ వివాదాన్ని ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లడానికి ముందే, బాలీవుడ్‌కు చెందిన పలువురు పెద్దలు దీనిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించారట. ముఖ్యంగా అమీర్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి హీరో రణవీర్ సింగ్‌కు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేశారని, కానీ ఆ రాయబారం ఫలించలేదని అశోక్ పండిట్ స్పష్టం చేశారు.
అసలు ఈ గొడవ ఎందుకు ఇంత పెద్దదైందనే వివరాల్లోకి వెళితే.. 'డాన్ 3' ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం మరియు స్క్రిప్ట్ వర్క్ కోసం ఫర్హాన్ అక్తర్ బృందం ఇప్పటికే దాదాపు రూ. 45 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. షూటింగ్ ప్రారంభించడానికి కేవలం కొన్ని వారాల ముందే రణవీర్ సింగ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ మరియు స్క్రిప్ట్ డిలేస్ నెపంతో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడట. ఒక నటుడు ప్రాజెక్ట్ కమిట్ అయిన తర్వాత ఇలా సడన్‌గా హ్యాండ్ ఇస్తే సదరు నిర్మాణ సంస్థకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే గతంలో రణవీర్ సింగ్‌పై FWICE నాన్-కోఆపరేషన్ నోటీసులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన చర్చల అనంతరం ఆ నోటీసులను ఉపసంహరించుకున్నప్పటికీ, బాలీవుడ్ స్టార్ హీరోల కమిట్‌మెంట్స్ పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. స్టార్ హీరోలు ఎంతటి వారైనా ప్రొడక్షన్ హౌస్‌ల ఆర్థిక నష్టాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఒకవేళ తప్పుకుంటే ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందేనని అశోక్ పండిట్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ పంచాయితీలో సల్మాన్ ఖాన్ కూడా జోక్యం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కేవలం రూమర్స్ గానే కొట్టిపారేశారు.
మరోవైపు రణవీర్ సింగ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో రీసెంట్ గా సాధించిన 'ధురంధర్' సక్సెస్ తర్వాత ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని, సరైన స్క్రిప్ట్ లాక్ చేయకుండా కాలయాపన చేయడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ 'డాన్ 3' రచ్చతో బాలీవుడ్ ప్రొడక్షన్ వర్గాలలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని ఫర్హాన్ అక్తర్ భావిస్తుండగా, రణవీర్ స్థానంలో మరో స్టార్ హీరోను వెతికే పనిలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పడినట్లు టాక్. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి లీగల్ టర్న్ తీసుకుంటుందో చూడాలి.
![]() |